పాడి రైతులకు వెన్నుదన్నుగా మిల్క్ సొసైటీ సేవలు మరింత విస్తరణ : ఛైర్మన్ మధుసూదన్ రావు
పాడి రైతులకు వెన్నుదన్నుగా మిల్క్ సొసైటీ
సేవలు మరింత విస్తరణ : ఛైర్మన్ మధుసూదన్ రావు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ది కాళహస్తి కో-ఆపరేటివ్ పాల సరఫరా సంఘం పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆ సొసైటీ ఛైర్మన్ మునగాల మధుసూదన్ రావు అన్నారు. పాడి రైతులకు మరింత అండగా నిలిచేలా సేవలను విస్తరించనున్నామని భరోసా ఇచ్చారు. పాలసరఫరా సంఘం నూతన పాలకవర్గం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తయిన సందర్భంగా స్థానిక సంఘం సొసైటీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాడి రైతులు, పట్టణ ప్రజల ప్రయోజనార్ధం 1952లో పాలసరఫరా సంఘం ఏర్పడిందన్నారు. మాధవరావు, వసంత రావులు ఆద్యులుగా సంఘానికి ప్రాణం పోశారనీ, లాభాల్లో నిలపారని కొనియాడారు. వారి వారసులుగా నేటితరం పాలక మండళ్ళు పాడి రైతులకు అండగా నిలబడుతుండటం హర్షణీయమన్నారు. పాల సరఫరా సంఘం పరిధిలో దాదాపు 20 కిలోమీటర్ల మేర సుమారు 29 గ్రామాల్లో 46 యార్డ్‌ల గుండా 5400 మంది పాడిరైతుల ద్వారా రోజుకు 9వేల లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఇందులో 5వేల లీటర్ల పాలను పట్టణ ప్రజలకు నేరుగా విక్రయిస్తుండగా, 1400 లీటర్ల పాలను వివిధ పాల ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. మిగిలిన పాలను ప్రయివేట్ డైరీలకు విక్రయిస్తున్నామని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తుల ద్వారా రైతులకు వస్తున్న ఆదాయాన్ని పాడి రైతులు, సిబ్బందికే ప్రోత్సాహకాలుగా అందిస్తున్నామని అన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో పాడి రైతులకు రెండు దఫాలుగా రూ.53లక్షలు, ఉద్యోగులకు రూ.12.37లక్షలు ప్రోత్సాహకాల రూపంలో అందించామని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాకి పన్ను కట్టాల్సి వస్తుందనీ, ఆ ఆదాయాన్ని పాడి రైతులకే ప్రోత్సాహక రూపంలో అందిస్తూ అండగా నిలుస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాడి రైతులను ప్రోత్సహించేందుకుగాను రూ.21.49 లక్షలు ఖర్చుచేసి బహుమతులు అందించామని వివరించారు. పాడి రైతుకు పాల ధరపై లీటర్‌కు రూ.3 పెంచామనీ, అదే లీటర్ పాలను రూ.37లకే పట్టణ ప్రజలకు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని పాల కేంద్రాలను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తులను, పాల సరఫరాను ప్రజలకు అందిస్తామని చెప్పారు. రూ.కోటి నికరాదాయం వచ్చేలా పాలకమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోందనీ, త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మీడియా సహకారం, ప్రచారం వల్ల ది కాళహస్తి పాల సరఫరా సంఘం పాల ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి, డిమాండ్ ఏర్పడిందనీ, భవిష్యత్తులోనూ మీడియా సహకారం ఉండాలని కోరారు. డైరెక్టర్లు హరినాథ్ రెడ్డి, రామయ్య, రామ్మూర్తి, వెంకట్ రెడ్డి, ముని చంద్రా రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










