
ప్రజాశక్తి- కె.కోటపాడు
పాల ఉత్పత్తిని పెంచడానికి ఆసక్తి, అవసరం ఉన్న రైతులకు పాడిపశువుల కొనుగోలు నిమిత్తం వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ తెలిపారు. విశాఖ డెయిరీకి ప్రతి రైతూ రోజుకు సరాసరి 10 లీటర్ల పాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మండలంలోని దాలివలస, కింతాడ శివారు జోగన్నపాలెం గ్రామాలలో శుక్రవారం ఆయన పాల ఉత్పత్తిదారులతో డెయిరీ డైరెక్టర్ సుందరపు గంగాధర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పాడి పశువులకు వైద్యం నిమిత్తం పశు వైద్యులను నియమించనున్నట్లు తెలిపారు. మేలు జాతి పశువులు పెంపకం, వాటి అభివృద్ధిని తెలుసుకోవడానికి దాలివలస, జోగన్నపాలెం పాడి రైతులకు బస్సు యాత్ర ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ డెయిరీ ట్రైనింగ్ సెంటర్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శరగడం శంకర్రావు, విశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ కృష్ణ, డిజిఎం పాండ్య రాజన్, ఆయా సొసైటీలో అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.