- కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ ఆంజనేయులు
ప్రజాశక్తి-వన్‌టౌన్: పాడి రైతులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా గేదెపాల సేకరణ ధర కేజి ప్యాట్ కు రూ 730ల నుండి రూ 780లకు పెంచుతూ తమ పాలకవర్గం తీర్మానించినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. శుక్రవారం పాలఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పాలకవర్గ సమావేశం వివరాలను ఆయన తెలియచేస్తూ పాల సేకరణ ధరను లీటరుకు 10 శాతం వెన్న గల పాలకు రూ 5లు రేటును పెంచి కేజి ప్యాట్ రూ.780 గా (రూ 730 నుండి రూ780 కు), ఇదే విధంగా ఆవు పాలకు టోటల్ సోలిడ్స్‌కు రూ 10లు (రూ.260 నుండి రూ 270) కు పెంచుటకు పాలకవర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో (2021-22) మూడు విడతల క్రింద రూ. 50 కోట్లు, 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను రెండు విడతలగా రూ.35 కోట్ల బోనస్‌ను రైతులకు పంపిణీ చేయటం జరిగిందన్నాయి. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో పాడి రైతు, పశు సంక్షేమం క్రింద ఈ ఎనిమిది నెలలకు గాను రూ. 10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో పాల సేకరణ వద్ధికై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు రుణ సదుపాయము కల్పించుటకు గాను ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ డిజిఎం బిజినెస్ అండ్ ఆపరేషన్స్ కె.రంగ రాజన్, వారి సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1150 కోట్లు టర్నోవర్ లక్ష్యంగా సమితి కషి చేస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో సమితి 4 లక్షల లీటర్ల కెపాసిటీతో ఆరు లక్షల లీటర్ల విస్తరణ సామర్థ్యంతో నిర్మిస్తున్న నూతన డెయిరీని అక్టోబర్ 2023 నాటికి ప్రారంభించుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు ఎర్నేని సీతాదేవి, దాసరి బాలవర్ధనరావు, ఉయ్యూరు అంజిరెడ్డి, అర్జా వెంకట నగేష్, చలసాని చక్రపాణి, వి.బి.కె.వి సుబ్బారావు, వేమూరి సాయి వెంకటరమణ, తిరుమల స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.










