
ప్రజాశక్తి-నక్కపల్లి:పాడి రైతుల అభ్యున్నతకు ఎనలేని కృషి చేస్తున్నట్లు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. మండలంలోని ఉపమాక లో పాల సేకరణ కేంద్రంను బుధవారం ఉదయం ఆయన సందర్శించారు. పాల సేకరణ విధానాన్ని పరిశీలించారు. సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి కొండబాబు, పాలకవర్గం సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పాల ఉత్పత్తిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ డెయిరీ అందిస్తున్న సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీపై సరఫరా చేస్తున్న సైలాజ్ గడ్డి , పశుదానాను విధిగా పశువులకు మేతగా వాడాలన్నారు. డెయిరీ తరపున అందజేస్తున్న సుఖీభవ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు మేలు జాతి పశువులను కొనుగోలుకు పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పాలు సరఫరా చేసిన పాడి రైతులను సత్కరించి, పశువులకు కాల్షియంను ఉచితంగా అందజేశారు.
ఉపమాకలో విశాఖ డెయిరీ నిధుల తో కళ్యాణ మండపం నిర్మించాలని సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి కొండబాబు, బుజ్జి, పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు ఆనంద్ కుమార్ ను కోరారు.గ్రామంలో కళ్యాణ మండపం లేకపోవడంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.శ్మశాన వాటిక అభివృద్ధి పరిచాలని, చేతి బోర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఉపమాక వెంకన్నను ఆనంద్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు, కృష్ణమాచార్యులు , శేషాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకన్న జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన చందనాడ పాల సేకరణ సెంటర్‌ను సందర్శించి, పాడి రైతుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ, డీజీఎం పాండ్య రాజన్, తుని యూనిట్ మేనేజర్ శ్రీను, సూపర్వైజర్ కిరణ్, మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, ఉప సర్పంచ్ ప్రగడ వీరబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొప్పిశెట్టి హరి, గ్రామస్తులు, వేతన కార్యదర్శులు, డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.