Jul 27,2023 00:08

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పశువులకు సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందించాలనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పింది. మూడేళ్లు గడుస్తున్నా ఈ కేంద్రాలు అరకొర సేవలకే పరిమితమయ్యాయి. అన్ని రకాల మందులూ అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. పశువులకు పూర్తిస్థాయిలో టీకాలు కూడా వేయడం లేదు. కాకినాడ జిల్లాలో 408 ఆర్‌బికెల పరిధిలో 76,502 ఆవులు, 2,82,273 గేదెలు, 1,01,870 గొర్రెలు, 1,41,229 మేకలు ఉన్నాయి. కాగా ప్రతి ఆర్‌బికెలోనూ 108 రకాల మందులు అందుబాటులో ఉండాలి. వీటిని ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో రూ.5 వేలు నుంచి రూ.10 వేలు విలువ చేసే మందులను అన్నిచోట్లా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఏ ఆర్‌బికెలో చూసినా 10 రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలిస్తే 108 రకాలకు గానూ 9 రకాల మందులు, రెండు రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇదే మండలం గొంచాలలో 6 రకాలు మందులు, ఒక రకం టీకా మాత్రమే ఉన్నాయి. పనసపాడు ఆర్‌బికెలో మందులు లేకపోవడంతో రైతులు అడిగితే మాత్రం సమీపంలో ఉన్న పశు వైద్య శాలకు వెళ్లి మందులు తెచ్చి ఇస్తున్నారు. రెండేళ్లుగా మందులు సరఫరా నిలిచిపోయాయని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం మందుల కోసం ఇండెంట్‌ పెట్టామని చెప్పారు. ఇలా పలుచోట్ల పాడి రైతులకు ఉపయోగపడే మందులు సక్రమంగా లేకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
పశు సంరక్షణ పట్టని ప్రభుత్వం
పశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ అన్ని నెలల్లోనూ పశువులకు వివిధ రకాల వైద్య సేవలను అందించడంలో భాగంగా టీకాలు వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జూన్‌లో గేదెలు ఆవుల్లో గొంతువాపు, జబ్బు వాపు మొదటి విడత టీకాలు వేయాలి. జూలైలో కుక్కలకు ర్యాబిస్‌ వ్యాధి నివారణకు, గొర్రెలు, మేకల్లో నీలి నాలుక వ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంది. ఆగస్టులో సంకరజాతి ఆవుల్లో థైలీరియా వ్యాధి నివారణకు, ఆవులు, గేదెల్లో గాలికుంట నివారణ మొదటి విడత టీకాలు వేయాలి. తరచూ వచ్చే జ్వరం, అజీర్ణం, విరేచనాలు, దగ్గు, కాళ్ళ నొప్పులు తదితర రోగాలకు ఇక్కడ వైద్య సేవలు అందించాలి. దూడలకు గొంతువాపు వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్‌ వ్యాక్సిన్‌, పందులకు స్వైన్‌ ఫ్లూ టీకాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. కత్రిమ గర్భధారణకు ఎద సూదులు, చూలు కట్టకుంటే పరీక్షించడం వంటి సేవలు అందించాలి. కానీ ఇవేమీ పూర్తిస్థాయిలో అండడం లేదు. కొన్ని చోట్ల దమ్ము టీకాలు మాత్రమే అందుబాటులో వుంటున్నాయి. ఇంకొన్ని చోట్ల బ్రూసెల్లోసిస్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. పశువుల్లో డయేరియా వస్తే డైవక్ట్‌ మాత్రలు, పొట్టలో పాములు పట్టకుండా డి.వార్మ్‌ మాత్రలు, పాలు సక్రమంగా ఇచ్చేందుకు లెఫ్ట్‌ డీన్‌ మాత్రలు, గాయాలు, పుండ్లు మానేందుకు పొటాషియం పర్మాంగనేట్‌ లిక్విడ్‌, కడుపునొప్పి కోసం సిప్రోవెట్‌, పాలు తీసేటప్పుడు గడ్డలు కడితే సన్న కట్టు శుభ్రపరచడానికి జంటామైసిన్‌, ఆహారం అరుగుదలకు ఎట్రాఫిన్‌, కాళ్లు వాపులకు సోడియం సిలికేట్‌ మందులు అక్కడక్కడా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువగా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పాడి రైతులు బయట మార్కెట్‌లో మందులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. జ్వరం, పారుడు వ్యాధి, మేత మేయకపోవడం, నులి పురుగులు, గర్భదారణ సమస్యలు తరచూ వస్తున్నాయి. వీటి కోసం రూ..500 నుంచి 1000 వరకూ ఖర్చు చేస్తున్నారు.