ప్రజాశక్తి-హుకుంపేట:పాడి పశువుల పెంపకం తో ఆర్ధిక తోడ్పాటు కలుగుతుందని మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంత కుమారి అన్నారు. శనివారం మఠం కొత్తురు గ్రామంలో వెటర్నరీ అసిస్టెంట్ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు విజ్ఞాన బడి కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. అనంతరం గిరిజన రైతులతో ఆమె మాట్లాడుతూ, పాడి పశువులు, మేకలు, కోళ్లు పెంపకంతో ఆర్ధికంగా మంచి లాభాలు పొందవచ్చునని పేర్కొన్నారు. అనారోగ్యం లేదా పిడుగు పాటుతో మేకలు మృతి చెందితే ప్రభుత్వం ఒక్కో మేకకి రూ.15 వేల ఇన్సూరెన్స్ ఇస్తుందని అన్నారు. రైతులు కేవలం ముప్పై రూపాయలు కడితే, ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. 20 మంది రైతులకు పశు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు పాంగి మత్స్య కొండ బాబు, గెమ్మెలి అప్పారావు, వాలంటీర్ మహేష్ బాబు పాల్గొన్నారు.