Oct 19,2023 20:36

పశువైద్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెడి విశ్వేశ్వరరావు

ప్రజాశక్తి - వంగర : పాడి పశువులకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని పశుసంవర్ధక శాఖ జెడి ఎ. విశ్వేశ్వర రావు అన్నారు. మండల కేంద్రంలో ఉన్న పశువైద్య కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది అంతా గ్రామాల్లో పాడి రైతులతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని సూచించారు. మండలంలో మద్దివలసలో గల పదిమంది గొర్రెల యజమానులకు గొర్రెలను రక్షించుకునేందుకు సబ్సిడీతో కూడిన వలలు, రైన్‌ కోట్లు, టార్చ్‌లైట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. పాడి రైతులకు అవసరమైన గడ్డి విత్తనాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు కృత్రిమ గర్భోత్పత్తి మందులు సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయన్నారు. పశు నష్టపరిహారానికి సంబంధించి మండలంలో ఉన్న రైతులకు నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని విలేకర్లు ప్రశ్నించగా ఇప్పటికే అర్హులందరికీ బిల్లులు పెట్టామని తెలిపారు. ఏ గ్రామంలోనైనా పాడి పశువులు అనారోగ్యానికి గురైతే పాడి రైతులు 1962కి కాల్‌ చేసి అవసరమైన సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌ నీలయ్య, సంతకవిటి, రాజాం అసిస్టెంట్‌ డైరెక్టర్లు సిహెచ్‌, తిరుపతిరావు, జయప్రకాష్‌, వంగర పశు వైద్య ఇంఛార్జి వైద్యాధికారి అనిల్‌ సిబ్బంది పాల్గొన్నారు.