ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మన్యంలో ఆయా మండలాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఎండ వాతావరణం కొనసాగి, ఆ తర్వాత వాతావరణం మారి పోయింది. నాలుగు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలసేపు కురిసిన వర్షానికి పాడేరు పట్టణం తడిచి ముద్దయింది. దీంతో పాడేరులోని రోడ్లన్నీ చిత్తడిగా మారి, జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు వాహనాలను ఎక్కడి కక్కడే నిలిపి వేశారు. పలువురు వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. అనంతగిరి మండలంలోని పలు చోట్ల వర్షం కురిసింది. వర్షాలకు రోడ్లు బురదమయంగా మారడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. రోడ్లన్నీ చిత్తడిగా మారి, జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.










