కురుస్తున్న వర్షం
ప్రజాశక్తి-పాడేరుటౌన్:అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు వాతావరణం కొనసాగి, ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వర్షానికి పాడేరు పట్టణం తడిచి ముద్దయింది. భారీగా వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. అలాగే దూర ప్రాంతాల్లో పిడుగులు పడిన శబ్దాలు వినిపించాయి. ఉరుములతో కూడిన వర్షం పడడంతో జనం ఆందోళనకు గురయ్యారు. భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లు వీధులు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు.










