Oct 14,2022 23:49

మురుమూరులో ఎలుకలు తినేసి, పాడైపోయిన వరద సహాయ బియ్యం

ప్రజాశక్తి - ఎటపాక
వరద బాధితులకు సహాయార్థం ప్రభుత్వం నుండి పంపిణీ చేసిన ఏడు క్వింటాళ్ల బియ్యం అధికారుల నిర్లక్ష్యంతో వరద బాధితులకు చేరకుండానే మండలంలోని మురుమూరులో పాడైపోయాయి. వరద సహాయర్థం ప్రభుత్వం ఆగస్టు నెలలో మురుమూరు గ్రామానికి 14 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేసింది. ఈ బియ్యాన్ని మురుమూరు పాఠశాలలో నిల్వ ఉంచారు. గ్రామానికి బియ్యం సరఫరా చేసిన అనంతరం కూడా 3 సార్లు గోదావరి వరద ఆ గ్రామాన్ని చుట్టు ముట్టింది. నెల రోజుల పాటు బాహ్య ప్రపంచంతో గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ సందర్భంగా స్థానిక రెవిన్యూ అధికారిని ప్రభుత్వం పంపిన బియ్యం పంపిణీ చేయమని కోరినప్పటికి బియ్యం పంపిణీ చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. వరదల సందర్భంగా పస్తులున్న ప్రజలకు బియ్యం పంపిణీ చేయకుండా, నిల్వ ఉంచడంలో జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాలు వస్తుంటే, పందికొక్కులు చేరి బియ్యం పాడు చేస్తే మేమేమి చేయాలంటూ విఆర్‌ఓ బదులివ్వడం కొసమెరుపు.