ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మార్క్‌ఫెడ్ రైతుల వద్ద నుంచి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసి సిడబ్ల్యూసి, పెదకాకాని గోడౌన్‌లో నిల్వ ఉంచిన మొక్కజొన్న, శనగలును జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి మంగళవారం తనిఖీ చేశారు. గోదాము నిర్వహణ గురించి నాణ్యతా ప్రమాణాలపై గోడౌన్ మేనేజర్ తెలిపారు. అక్కడి హమాలీలతో జెసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనుమర్లపూడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల నుంచి అర్జీలను తీసుకున్నారు. పాక్షికంగా పాడైన తమ మొక్కజొన్నను కొనుగోలు చేయట్లేదని రైతులు చెప్పారు. దీనిపై జెసి స్పందించి పంట నష్టంలో భాగంగా తమ మండల వ్యవసాయ అధికారి ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల మేరకే పంట కొనుగోలు చేస్తారని సిడబ్ల్యూసి పెదకాకాని మేనేజర్ చెప్పారు. గుంటూరు జిల్లాలో 170 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకూ జిల్లాలో 85 మంది రైతుల వద్ద నుండి 727 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన నగదును త్వరలోనే రైతుల ఖాతాలలో జమ చేస్తామన్నారు.










