Apr 27,2023 23:48

బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/మేడికొండూరు : ఎన్నికల ముందు మూడు రాజధానులు అంటే ప్రజలు జగన్‌ తాట తీసేవారని, గెలిచాక మూడుముక్కల ఆట ఆడారని, రాజధానిపై కుల ముద్రా వేశారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అమరావతిని ధ్వంసం చేసిన వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం గండ్లపాలెం గురువారం రాత్రి 9 గంటలకు జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సంపద సృష్టితో ప్రజలకు మేలు జరుగుతుందని, సంపదను దోచుకునే వారు కాకుండా సృష్టించేవారు నాయకులుగా ఉండాలని అన్నారు. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చి మంచి రాజధాని కట్టాలని కోరారని, రాజధాని నిర్మాణం సగం పూర్తవ్వగా మిగతా సగం పూర్తిచేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎకరా భూమి రూ.10-20 వేలుంటే ఇప్పుడు రూ.30-40 కోట్లుగా ఉందన్నారు. అమరావతి భూముల్లో కుంభంకోణం అన్నారని, తరువాత కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవ చేశారు. అసైన్డ్‌ భూములంటూ ఏవేవో ఆరోపణలు చేశారని, అసైన్డ్‌ భూములకు కూడా ల్యాండ్‌ పూలింగ్‌లో డబ్బులిచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదని అన్నారు. రైతు కూలీలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. తాను కట్టిన సచివాలయంలో కూర్చుని వాటిపై ఆరోపణలు చేస్తున్న ఫేక్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాజధానిని గ్రాఫిక్స్‌ అంటున్న మంత్రులు వాటి పైకి ఎక్కి దూకితే తెలుస్తుందని, తద్వారా రాష్ట్రానికి పట్టిన శని విరగడ అవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమకారులపై పోలీసులుదారుణంగా వ్యవహరించారని, రైతులపై 2 వేల మందిపై 200 కేసులు పెట్టారని, ఎప్పటికైనా న్యాయమే గెలిచి అమరావతి రాజధానిగా నిలుస్తుందని అన్నారు. కృష్ణానది సమీపంలో ఉన్నా ఇసుక దొరకడం లేదని, ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.5 వేలు, లారీ ఇసుక రూ.75 వేలు చేశారని, ఈ డబ్బంతా తాడేపల్లి కొంపకు పోతుంతుందని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. బాబాయి గొడ్డలి వేటు.. కోడికత్తి డ్రామా.. పింక్‌ డైమండ్‌.. అమరావతిపై డ్రామాలు.. ఇలా అన్ని అంశాలపై డ్రామాలు ఆడి అధికారంలోకి వచ్చిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. అప్పుడు ఉన్న అన్నక్యాంటీన్‌ ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించిన చంద్రబాబు.. చంద్రన్న బీమా వస్తుందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. పేదరికాన్ని రూపుమాపడానికే తాను పిపిపిపి అనే ఒక విధానాన్ని ప్రతిపాదించానని, పబ్లిక్‌, ప్రైవేట్‌, ప్రజల పార్టనర్‌షిప్‌తో అమరావతి నగరం పూర్తయ్యి ఉంటే రూ.2-5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేదన్నారు. అలాంటి రాజధానిని జగన్‌ నాశనం చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసిపి ఓడిపోవడం ఖాయమని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసిపిని బంగాళా ఖాతంలో కలిపేయాలని అన్నారు. జగన్‌ వైనాట్‌ కుప్పం అంటున్నాడు.. వైనాట్‌ కుప్పం కాదు.. ఇప్పుడు చెపుతున్నా వైనాట్‌ పులివెందుల వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టిడిపి జెండా ఎగురుతుందని ఉద్ఘాటించారు.