Sep 21,2023 20:58

రాజకీయ పార్టీల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ ప్రక్రియ తుదిదశకు చేరింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 1847 పోలింగ్‌ స్టేషన్లు ఉండనున్నాయి. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రాజాం నియోజకవర్గంలోని కేవలం ఒక్క పోలింగ్‌ స్టేషన్‌ రద్దు కానుంది. 49 పోలింగ్‌ స్టేషన్ల స్థానాలు మారనున్నాయి. మరో 99 పోలింగ్‌ స్టేషన్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకొని పేర్లు మారనున్నాయి. ఈ వివరాలను గురువారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్‌ నాగలక్ష్మి వెల్లడించారు. కలెక్టరేట్‌లో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో, ఆయా నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు మాట్లాడుతూ, రేషనలైజేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలిపారు. నియోజకవర్గాల్లోని పోలింగ్‌ స్టేషన్ల మార్పులు, చేర్పులను వివరించారు. తుది జాబితా ఖరారు చేసేముందు చివరిసారిగా ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్‌ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. ఒకటిరెండు విషయాల్లో ఇంకా కొద్ది సమయం కావాలని కోరారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన ధరఖాస్తులు, వాటిపై తీసుకున్న చర్యలను కలెక్టర్‌ వివరించారు. ఓటుకు ఆధార్‌ అనుసంధానం స్వచ్చందమేనని, తాత్కాలికంగా ఈ ప్రక్రియ ఆగిందని ఈ సందర్భంగా కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎంవి సూర్యకళ, ఎం.అప్పారావు, బి.సుదర్శనదొర, వెంకటేశ్వర్రావు, పద్మలత, మున్సిపల్‌ కమిషర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ దేవ్‌ ప్రసాద్‌, డిటిలు, విజయనగరం ఎంపిపి మామిడి అప్పలనాయుడు, వివిధ పార్టీల ప్రతినిధులు ఐవిపి రాజు, రొంగలి పోతన్న, శ్రీనివాసరెడ్డి, కె.తవిటిరాజు, బి.శివప్రసాదరెడ్డి, ఎస్‌.సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.