Jul 20,2023 20:48

రాజకీయ నాయకులకు వివరిస్తున్న ఈఆర్‌ఒ

ప్రజాశక్తి-ఆలూరు
18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు, సవరణ చేసుకోవాలని ఈఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. గురువారం ఆలూరు తహశీల్దార్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటు నమోదు, సవరణ కోసం ఈనెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బిఎల్‌ఒ)తో పాటు సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల తరఫున బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బిఎల్‌ఎ)ను నియమించుకోవాలని సూచించారు. ఎలాంటి గొడవలకూ తావివ్వకుండా సామరస్యంగా ఓటరు నమోదు, సవరణను చేపట్టాలని తెలిపారు. వారి వివరాలతో సంబంధిత దరఖాస్తును ఏఈఆర్‌ఓ తహశీల్దార్‌ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తహశీల్దార్‌ రామాంజనేయులు, డిప్యూటీ తహశీల్దార్‌ విజరు కుమార్‌, ఆర్‌ఐ, ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ బసన్నగౌడ్‌, ఎఎస్‌ఒ ఈశ్వర్‌ పాల్గొన్నారు.