ప్రజాశక్తి-విశాఖపట్నం : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో 'ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023' పై కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునతో పాటు ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో ముఖేష్‌కుమార్ మీనా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడుతూ, జిల్లాలో ఎలక్టోరల్ పాపులేషన్ (ఈపీ) నిష్పత్తి తక్కువగా ఉందని, దీన్ని పెంచేందుకు పోలింగ్ స్టేషన్ల వారీగా సమీక్షించాలన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బిఎల్‌ఎ)లను నియమించాలని, మండలస్థాయిలో బిఎల్‌ఒ, బిఎల్‌ఎలతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం ద్వారా ఓటర్ల జాబితాల రూపకల్పనలో మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఓటరు తొలగింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి ఫామ్-7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలన్నారు. వలస వెళ్లిన వారి పేరును ఏదైనా సర్టిఫికెట్? ఆధారంగానే తొలగించాలన్నారు. 18-19 ఏండ్లు నిండిన వారిని గుర్తించి కొత్త ఓటరు ఎన్‌రోల్‌మెంట్ కోసం ఆయా కాలేజీల్లో ఒక పర్సన్‌ను నియమించి ఓటుహక్కు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టణాల్లో మెప్మా గ్రూపులు, వార్డు ఆఫీసర్లను కో-ఆర్డినేషన్ చేస్తూ కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు బిఎల్‌ఒలకు మార్గదర్శకంగా ఉంటూ పురోగతిని సమీక్షించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు , ట్రాన్సజండర్స్ , నిరాశ్రయులను గుర్తించి ఎన్‌రోల్ చేయాలన్నారు. జనవరి నెలలో తుది జాబితాను ప్రచురించనున్న నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, ప్రచురణ ఈ మూడు దశల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై సమీక్షిస్తూ ఓటరు నమోదు కోసం వచ్చిన ఫామ్స్‌ను ఎలా పరిశీలిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తునూ క్షుణ్నంగా పరిశీలించాలన్నారు.
జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ దోషరహిత జాబితా రూపకల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.










