ప్రజాశక్తి -భీమునిపట్నం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు గుర్తింపు కార్డునకు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ఆర్‌డిఒ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ ఎస్ భాస్కరరెడ్డి మాట్లాడుతూ, ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానపూర్తిగా ఓటరు వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఇప్పటివరకూ ఏటా జనవరి ఒకటిన కొత్తగా ఓటరు నమోదు జరిగేదని, ఇకనుంచి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫారం 6ను బిఎల్‌ఒతో పూర్తిచేసి గరుడా డిజిటల్ దరఖాస్తులో గానీ, ఓటరు దరఖాస్తుతో ఆధార్ జెరాక్స్ కాపీని జతపరిచి తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఓటరు ఆధార్ వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. దీనిపై బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో టిడిపి నుంచి గంటా నూకరాజు, సిపిఎం నుంచి ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పల నాయుడు, వైసిపి నుంచి ఎం షణ్ముఖరావు, బిజెపి నుంచి కె రామా నాయుడు, వి శ్రీహరి, బడిగంటి నీలకంఠం పాల్గొన్నారు.










