Nov 21,2023 22:44

జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న జెసి నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
ప్రతిఒక్కరూ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై నిర్వహించిన బైక్‌ ర్యాలీని నగరంలోని పురుషుల ప్రభుత్వ కళాశాల వద్ద మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జిల్లా జనాభాలో 18 ఏళ్లు నిండిన యువత 46 వేల మంది ఉండగా, వారిలో 18 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. మిగిలిన వారినీ ఓటర్లుగా చేరాలన్నదే స్వీప్‌ కార్యక్రమం లక్ష్యమన్నారు. డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ సాగుతుందని, ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. జిల్లాలో 2,500 మంది అధికారులు 24 లక్షల మంది ఓటర్ల జాబితా తయారీలో ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్నారని చెప్పారు. ఓటుహక్కు వినియోగించని వారికి అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. స్వీప్‌ కార్యక్రమాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలన్నారు, ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, తహశీల్దార్‌ కె.వెంకటరావు, సచివాలయ సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.