వినుకొండ: ప్రతి పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం వినకొండకు వచ్చిన ఆయన గంగినేని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పర్యటించి డిగ్రీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు లేని 14 మంది డిగ్రీ విద్యార్థులకు ఓటు హక్కు కల్పించేలా సంబంధిత ఫారాలను పూర్తి చేసి ఓటు హక్కు కల్పించవలసిందిగా సంబంధిత ఈఆర్‌ఓ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు ఉన్నవారు ఓటు హక్కుకు అర్హులని, ఆన్లైన్లో తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకుంటే 20 రోజుల్లో మీ అడ్రస్ కు ఓటు గుర్తింపు కార్డు వస్తుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు వయస్సు, అడ్రస్ ప్రూఫులు తో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఓటు ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వినుకొండ తాసిల్దార్ కిరణ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్, డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినుకొండ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం సందర్శించి అక్కడ భూములు రి-సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా అందుగులపాడు గ్రామానికి సంబంధించి క్లెరికల్ మోడ్, ఉమ్మడివరం గ్రామానికీ సంబంధించి విలేజ్ సెక్రటరీ లాగిన్లను నిశితంగా పరిశీలించి కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. వినుకొండ నియోజకవర్గ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కే. శ్రీరాములుమండల రెవెన్యూ అధికారి కిరణ్ పాల్గొన్నారు.
దేవాలయం పునర్ నిర్మాణానికి శంకుస్థాపన
వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్ నిర్మాణ శంకుస్థాపన పూజా కార్యక్రమాలకు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పున ర్ నిర్మాణ మహౌత్సవం చేపటడం ఎంతో సంతోషకరమని నిర్మాణంలో ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. శంకుస్థాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు తో పాటు ఆలయ అభివద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భూ హక్కు పత్రాలను అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూములు రీ- సర్వే కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామానికి సంబంధించి 40 మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలను శుక్రవారం ఉదయం గ్రామ సచివాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సైదులు, డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు, విలేజ్ రెవెన్యూ అధికారి మంగయ్య పాల్గొన్నారు.










