Mar 14,2023 00:42
మందకొడి పనితీరుతో తిరుణాళ్లగా మారిన పోలింగ్‌ కేంద్రం

ప్రజాశక్తి-మెదరమెట్ల: సోమవారం జరిగిన శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఒక ఓటరు సుమారు ఐదు గంటల పాటు వరుసలో నుంచోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలోని మేదరమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో నైపుణ్యం లేని యంత్రాంగాన్ని నియమించటం, 1,338 ఓట్లు ఉన్న మండలంలో ఒకే బూత్‌ ఏర్పాటు చేయడం వంటి ఆలోచనా రహితమైన నిర్ణయాల వల్ల, ఓటర్లు నడి ఎండలో రోడ్డుపై ఐదు గంటల పాటు నుంచోవలసి వచ్చింది. దీనికి కారణం ఏది ఏమైనప్పటికీ సుమారు 100 నుంచి 150 మంది వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుదిరిగారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు 664 ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారు 50 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. నాలుగు గంటలకు సుమారు 500 మందిని పోలింగ్‌ స్టేషన్లోని ఆవరణలోకి నెట్టేశారు. దీంతో అక్కడ తిరుణాల వాతావరణం కనిపించింది. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వ అధికారులు అనాలోచిత నిర్ణయాలవల్లే ఓటర్లు ఇబ్బంది పడ్డారనే విమర్శలు వినవస్తున్నాయి. పోలింగ్‌ ఎన్ని గంటలకు పూర్తవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది.
పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన ఏఎస్‌పి
మేదరమెట్లలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని అడిషనల్‌ ఎస్పీ మహేష్‌ సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ జరుగుతున్న తీరు గురించి తహశీల్దారు లక్ష్మీనారాయణతో మాట్లాడారు. పోలింగ్‌కు ఎక్కువ సమయం ఎందుకు పడుతోందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
73 శాతం పోలింగ్‌
మేదరమెట్లలో 1338 గ్రాడ్యుయేట్‌ ఓట్లకు గాను 980 (73.4 శాతం) పోలయ్యాయి. 96 టీచర్ల ఓట్లకు గాను 92 (93.8 శాతం) పోలయ్యాయి.