Aug 28,2023 20:40

విత్తనం వేయకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న పొలం

ఒట్టిపోయిన పొలాలు..
- మహానంది మండలంలో 4750 ఎకరాల్లో పడని విత్తనం
- ప్రశ్నార్థకంగా ఖరీఫ్‌ పంటల సాగు - వర్షాల కోసం రైతన్న ఎదురు చూపులు
ప్రజాశక్తి - మహానంది

     ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగుపై రైతన్నలు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ కష్టాలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆగస్టు ఆఖరికి వస్తున్నా సరైన వర్షాలు కురవకపోవడంతో భూములు పంటల సాగుకు నోచుకోలేదు. మహానంది మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు ప్రారంభంలో కురిసిన వర్షాలకు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. మరికొందరు రైతులు విత్తనాలు వేయకుండా వర్షాల కోసం ఎదురు చూపులు చూస్తుండడంతో పొలాలు ఒట్టిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మహానంది మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రధానంగా మొక్కజొన్న, అరటి, పత్తి, వరి, మునగ, మినుము తదితర పంటలను రైతులు సాగు చేస్తారు. మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. జులైలో కురిసిన వర్షాలకు మసీదుపురం, తమ్మడపల్లి, నందిపల్లె, గాజులపల్లె గ్రామాల్లో రైతులు మొక్కజొన్న 625 ఎకరాలు, మినుము 375 ఎకరాలు, పసుపు 125 ఎకరాలు, వరి 4 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆ తర్వాత నుండి వర్షాలు జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మిగతా 7 గ్రామాల్లో రైతులు పొలాల్లో 4750 ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాల కారణంగా రైతన్నలు పొలాలను సిద్ధం చేసి తొలకరి చినుకులు పడిన వెంటనే విత్తనాలు వేయాలన్న సంకల్పంతో అప్పటికే విత్తనాలను అప్పులు చేసి తెచ్చి పెట్టుకున్నారు. కొందరు రైతులు ఆనవాయితీగా చేర్పులు మార్పులు చేసుకుని పంటలు సాగు చేస్తారు. అయితే ఆదిలోనే వర్షాలు లేక రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. గత సంవత్సరం ఈ సమయంకల్లా మండలంలో రైతులు విత్తనాలు వేయడంతోపాటు వ్యవసాయ పనుల్లో బిజిగా గడుపుతూ ఉండేవారు. విత్తనాలు మొలకలెత్తి సుమారు నెల పైరు సాగులో ఉండేదని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది మాత్రం ప్రతిరోజు సాయంత్రం సమయంలో మేఘాలు ఊరిస్తూ వీస్తున్న గాలులకు రైతన్నలు వర్షాలు పడుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. వర్షాలు మాత్రం పడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వర్షాలు ఆలస్యంగా పడితే పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు లేకపోతే సరైన దిగుబడి రాక రైతన్నలు నట్టేట మునిగే ప్రమాదం ఉంది. కొన్ని గ్రామాల్లో చిన్న, సన్న కారు రైతులు పొలాలకు కౌలుకు తీసుకుని ముందుగానే గుత్తలు చెల్లించారు. సకాలంలో వర్షాలు రాకపోతే సరైన పంటలు రాక పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా చెల్లించాలోనని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ఖరీఫ్‌ సాగులో వేసే విత్తనాలు మొలకెత్తే సమయం మించిపోతుందని రైతుల ఆందోళన చెందుతున్నారు. జూన్‌ మొదటి వారంలో ప్రతి ఏటా రుతుపవనాలు రావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు రాకపోవడంతో రైతులు వారి నమ్మకం మేరకు వర్షాలు కురవాలని ఆయా గ్రామాల్లో అనేక పూజలు చేస్తున్నారు. ఈ నెల చివరికైనా ఆ వర్షం కురుస్తుందని ఆశించిన రైతన్నలకు నిరాశే ఎదురవుతోంది. ఏదేమైనప్పటికీ ప్రకృతి రైతులపై కన్నెర్ర చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం ఉచితంగా అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.