ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా పని చేస్తున్న సచివాలయాల్లోని గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీలు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న వీరంతా విధి నిర్వహణలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా పలు రకాల యాప్‌ల పని భారం ఎక్కువై అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 503 మంది హెల్త్ సెక్రటరీలు విధి నిర్వహణలో సమయ పాలన లేకుండానే కష్ట పడుతున్నారు.
మోయలేని యాప్‌ల భారం
దాదాపు 70 రకాల యాప్ ల భారంతో హెల్త్ సెక్రటరీలు ఆయా సచివాలయాల్లో మోయలేని భారంతో సతమతమవుతున్నారు. గ్రామ, వార్డుల పరిధిలో గర్భిణులు, పిల్లలకు టీకాలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే మందుల వివరాలు, ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే, శానిటేషన్, లెప్రసీ, టిబి వంటి డేటాను ప్రతిరోజూ యాప్‌లలో పొందుపరచాల్సి వస్తోంది. ఎన్‌సిడిసిడి, అభ, ఆర్‌సిహెచ్, అనమోల్, ఎన్‌డిడి, ఎన్‌ఎల్‌ఇపి తదితర యాప్‌లతో బాటు ఆయా సచివాలయాల పరిధిలో కొత్తగా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఇటీవల కొత్తగా వచ్చిన యులిన్ యాప్‌లో నమోదు చేయాలి. ఇవి కాక ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగులు ఆస్పత్రిలో చేసినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకూ 10 రకాల యాప్‌లలో సమాచారాన్ని నమోదు చేయాలి. ఇలా డ్యూటీ సమయానికి సంబంధం లేకుండా గంటల తరబడి హెల్త్ సెక్రటరీలు యాప్‌లతో కుస్తీలు పడుతున్నారు. డ్యూటీ సమయం ముగిసినా ఇళ్లకు వచ్చిన తర్వాత కూడా రాత్రి 10 గంటల వరకూ యాప్‌ల పని చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఒక్కో సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి ఒత్తిళ్లకు గురై సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పని ఎక్కువ.. వేతనాలు తక్కువ
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వీరికి కనీస వేతనాలు అండడం లేదు. 2022 పిఆర్‌సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని సెక్రటరీలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి దాదాపు 9 నెలలు లేటుగా ప్రొబేషన్ డిక్లేర్ చేశారు. అయితే ఈ కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ ఇవ్వలేదు. కావున 9 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్, జనవరి నుండి డిఎ ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవానికి 2,500 జనాభాకు ఒక ఎఎన్‌ఎం ఉండాలి. కానీ చాలా సచివాలయాల్లో 4 నుంచి 8 వేల జనాభాకు ఒక ఎన్‌ఎం పనిచేస్తున్న మూలంగా పని ఒత్తిడి పెరిగింది. డ్యూటీ సమయాల్లో కాక జూమ్ మీటింగ్‌లను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారు. ఇతర సచివాలయ ఉద్యోగుల వలే సాయంత్రం 5 గంటల వరకే పని ఉండేలా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు మంజూరు కోసం వివిధ విభాగాల్లో ఆరుగురు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని రెగ్యులర్ క్షేత్రస్థాయి సిబ్బందికి అమలవుతున్న విధంగా హెల్త్ సెక్రటరీలకు 35 క్యాజువల్ లీవ్‌లు, ఇతర లీవులు అమలు కావడం లేదు. ఇలా అనేక సమస్యలు నడుమ వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని రెండు రోజుల క్రితం కాకినాడ కలక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.










