Nov 18,2023 22:22

ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఆర్‌డిఒ హేమలత

పార్వతీపురం టౌన్‌: యువత ఓటరుగా నమోదై ఎన్నికల్లో ఆదర్శంగా నిలవాలని ఆర్‌డిఒ కె.హేమలత పిలునిచ్చారు. ఓటరు నమోదుపై శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు ఆర్హులన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని, 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువత ఓటరుగా నమోదుకు అర్హులన్నారు. యువత బాధ్యతాయుతంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలంగా ఆలోచించాలని ఆమె సూచించారు. మంచి సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. యువత ఓటు హక్కు కలిగి ఉండటం ముఖ్యమని వారే బాధ్యతాయుతమైన పౌరులను అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదు కాని వారికి తెలియజేయాలని చెప్పారు. డిసెంబరు 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను బూత్‌ స్థాయిలో చేపట్టడం జరుగుతుందని ఆమె వివరించారు. అక్టోబరు 27న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు ఉంటారని ఆమె పేర్కొన్నారు. బూత్‌ స్థాయి అధికారుల వద్ద ఫారం - 6, 7, 8 అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చలపతి రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : ప్రతి విద్యార్థి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకత్వానికి ఆధారం అయ్యేలా ఉండాలని తహశీల్దార్‌ జె.రాములమ్మ అన్నారు. శనివారం ఆమె స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అవగాహనలో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీ వరం మాట్లాడుతూ, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప సదవకాశమని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు అని అన్నారు. ఈ మేరకు ప్రతి విద్యార్థి తమకు ఉన్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి విలువైన నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ రామయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ త్రినాధ, అధ్యాపకులు శ్రీ లక్ష్మి, కల్పన, శ్రీవాణి, తులసి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ :స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలురు)లో ఎన్‌ఎస్‌ఎస్‌, హ్యుమానిటీస్‌ స్థానిక మండల రెవెన్యూ అధికారుల బందం ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్‌ పైలా శంకర రావు అధ్యక్షతన ఓటు నమోదు, ప్రాధాన్యత అన్న అంశంపై అవగాహన జరిగింది. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది బి.శ్రీనివాసరావు , డి.టి, బిఎల్‌ నరసింహులు,. సీనియర్‌ అసిస్టెంట్‌ డి.శేఖర్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.