ప్రజాశక్తి-గుంటూరు : స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా ఓటర్ల జాబితాకి సంబంధించి డోర్ టు డోర్ సర్వేను బిఎల్‌ఓలు ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత ఎన్నికల సంఘం సూచనల మేరకు చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కమిషనర్ తన క్యాంప్ కార్యాలయంలో నగరంలో జరుగుతున్న డోర్ టు డోర్ ఓటర్ సర్వే పై మంగళవారం సమీక్షించారు. బిఎల్‌ఓలు ఓటర్ సర్వే పక్కాగా చేపట్టాలని, ప్రధానంగా ఒకే డోర్ నంబర్‌లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాటిని ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించారు. సర్వే విధుల్లో ఎక్కడా వాలంటీర్లకు కేటాయించొద్దని స్పష్టం చేశారు. బిఎల్‌ఓలు గుర్తింపు కార్డులు ధరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర ప్రజలు కూడా తమ ఇంటి వద్దకు ఓటర్ సమాచారం కోసం వచ్చే బిఎల్‌ఓలకు తగిన సమాచారం అందించి సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ కోటయ్య, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు కోసం సహకరించాలి..
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో గుంటూరు నగరానికి మెరుగైన ర్యాంక్ రావడంలో ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని, ప్రజలు కూడా తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో ప్రత్యేక యాప్ ద్వారా తెలియచేసి నగరానికి మెరుగైన ర్యాంక్ రావడంలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి కోరారు. మంగళవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజలు నేరుగా mygov platform, swacchata app, ss2023 vote for your city app, ss2023 vote for your city web ద్వారా ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఇంటి వద్దకు వచ్చే జిఎంసి వాలంటీర్లు, కార్యదర్శులకు తెలిపి అభిప్రాయాలను తెలియచేయాలన్నారు. ఇది ప్రతి ఏడాది కేంద్రం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజల అభిప్రాయం కోసమే ఓటీపీ అని, అపోహలకు గురికావద్దని తెలిపారు.










