ప్రజాశక్తి-సీతంపేట : ఓటరు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకొండ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఓటర్ల సర్వేను వేగవంతం చేసేలా బిఎల్‌ఒలకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు, మరణించిన వారి పేర్లు తొలగించడం, పోలింగ్ బూత్‌లను సరిచేయడం, వేరే రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు తొలగించడం వంటివి చేసేటప్పుడు నిబంధనల ప్రకారం పూర్తిచేస్తామని అన్నారు. రాజకీయ పార్టీలు చెప్పిన అంశాలను పరిశీలిస్తామన్నారు. కొత్త పంచాయతీలకు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బోగస్ ఓట్లు తొలగిస్తామన్నారు. ఒకే ఇంటి నంబర్ మీద ఎక్కువ ఓట్లు ఉన్న అంశాన్ని పరిశీలించి వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు. సరిగా కనిపించని ఓటర్ల ఫొటోలను కూడా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు నరసింహమూర్తి, డిటిలు, నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు.










