Jul 22,2023 21:59

సీతానగరంలో ఇంటింటి ఓటర్ల నమోదును పరిశీలిస్తున్న ఆర్‌డిఒ హేమలత

బలిజిపేట/సీతానగరం : ఓటరు పరిశీలన ప్రక్రియలో వాలంటీర్ల సేవలు వినియోగిం చరాదని ఆర్‌డిఒ కె.హేమలత స్పష్టం చేశారు. ఇంటింటి ఓటరు సర్వే ప్రక్రియలో భాగంగా బలిజిపేట మండలం పెదపెంకిలో 209, 210, 220 పోలింగ్‌ కేంద్రాలు, సీతానగరం మండలం చినభోగిలలో 154, 111 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో శనివారం ఆమె పరిశీలించారు. ఇంటింటి ఓటరు సర్వే ప్రక్రియ పక్కాగా జరగాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు (బిఎల్‌ఒలు) వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో భాగస్వామ్యం చేయరాదని ఆదేశించారు. అలా వినియోగిస్తే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యలు ఉంటాయని క్ష్మిఆమె హెచ్చరించారు. జూలై 21 నుండి ఆగస్టు 21వ వరకు బూత్‌ స్థాయి అధికారులతో ఇంటింటా ఓటరు వివరాల విచారణ జరుగుతుందని అన్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబరు 29 వరకు ఓటరు కార్డుపై ఫోటో మిస్‌ మేచింగ్‌, క్లారిటీ లేకపోవడం, పోలింగ్‌ కేంద్రాల మార్పు వంటి అంశాలను పరిశీలన ఉంటుందన్నారు. సమగ్ర ముసాయిదా జాబిత సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 16 వరకు జరుగుతుందని చెప్పారు. ముసాయిదా జాబితా అక్టోబరు 27న ప్రచురించడం జరుగుతుందని, అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకు అభ్యంతరాలు, క్లైమ్‌ లు సమర్పించవచ్చు అని ఆమె అన్నారు. 2023 అక్టోబరు 1నాటికి, 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయి అర్హత కలిగిన యువత ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
భామిని : సచివాలయం ఆవరణలో చేపడుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బిఎల్‌ఒలు ఇంటింటికి వచ్చి ఓటర్‌ సర్వే చేపడతారని తహశీల్దార్‌ ఎన్‌.అప్పారావు అన్నారు. 18 ఏళ్లు నిండి వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిఎల్‌ఒలు చందన, ప్రమోద్‌, గోపాల్‌, డిప్యూటీ తహశీల్దార్‌ శేఖరం, గ్రామస్తులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని బిఎల్‌ఒలంతా ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలిస్తున్నారని ఆర్‌ఐ మండంగి కృష్ణ అన్నారు. గరుగుబిల్లిలో చేపడుతున్న సర్వేను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్వోలు మండల అధికారులు ఓటర్ల జాబితా పరిశీలనకు సంబంధించి సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితా పునశ్చరణపై ఇంటింటికి వెళ్లి ఓటరు ధ్రువీకరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ తుమరాడ నాగరాజు, విఆర్‌ఒ గంట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : బిఎల్‌ఒలతో ఓటర్‌ పరిశీలన చేయాలని టిడిపి పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ బూతు లెవెల్‌ ఏజెంట్లకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని బూత్‌ లెవెల్‌ ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలుగు యువత టౌన్‌ అధ్యక్షులు పప్పల మహేష్‌, బల్ల హరి, యూనిట్‌ ఇంచార్జ్‌ తూముల రమేషు, సీనియర్‌ నాయకులు జామి సింహాచలం, జలుమూరు ప్రవీణ్‌ కుమార్‌, బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.