Jan 06,2023 00:03

మాట్లాడుతున్న ఓటరు నమోదు పరిశీలకులు బాబు

ప్రజాశక్తి-పాడేరు:ఓటరు నమోదు ప్రక్రియలో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని, తక్కువ ఇపి రేషియో (ఓటరు, జనాభా నిష్పత్తి) ఉన్న ప్రాంతాలలో కారణాలు విశ్లేశించాలని ఓటరు నమోదు పరిశీలకులు ఎ.బాబు కోరారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి ఓటరు నమోదు అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులలో ఉన్నత స్థాయిలో సిఇఓ నుండి క్రింది స్థాయి బిఎల్‌ఓ వరకు ఎన్నికల నిభందనల మేరకే పని చేయాలని సూచించారు. గత రెండు సమావేశాలలో పనుల పురోగతిపై పలు సూచనలు అందజేయడం జరిగిందని. ఆశించినంతగా లేదన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా సాగాలని, కొంతమంది బిఎల్‌ఓ.లు ఇది తమ పని కాదనుకుంటున్నారు.పోలింగ్‌ స్టేషన్ల వారీగా చేసిన తొలగింపులు, చేర్పులు తదితర వివరాలను నియోజకవర్గాల వారీగా పరిశీలకులు సమీక్షించారు. అధికంగా తొలగింపులు, చేర్పులు చేసిన బూత్‌ల్లో ఓటర్ల నిష్పత్తి చూడాలని అబ్జర్వర్‌ చెప్పారు. తిరస్కరించిన ఫారం-6లు, ఆధార్‌ ఫోటో అప్‌ డేషన్లపై వివరాలను పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు. బిఎల్‌ఓల పనుల నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. బిఎల్‌ఓలు పనుల పురోగతి సంతృప్తి కరంగా లేదని మరింత ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కొత్తగా నమోదైన వారందరికీ ఎఫిక్‌ కార్డులు అందజేయాలని సూచించారు. పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి 13 పోలింగ్‌ స్టేషన్ల జాబితాలు ఆయా కేంద్రాలకు సరఫరా చేసిందీ లేనిదీ ఆరా తీసారు. అనర్హత, డూప్లికేషన్‌, అండర్‌ క్వాలిఫికేషన్‌ అంశాలపై ఆరా తీసారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎలక్ట్రోరల్‌ అబ్జర్వర్‌కు కలెక్టర్‌ వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ, డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ నాటికి 7,15,707 మంది ఓటర్లు నమోదు కాగా, ప్రస్తుతం తుది జాబితా ప్రచురణ నాటికి 13,096 మంది పెరిగి 7,28,803 మందికి చేరిందని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ జే.శివ శ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారులు రోణంకి గోపాలకృష్ణ, సూరజ్‌ గనోరే, ఫర్మాన్‌ అహమ్మద్‌ ఖాన్‌, సబ్‌ కలెక్టర్లు వి.అభిషేక్‌, శుభం బన్సాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డిఆర్‌ఓ బి.దయానిధి, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.