Nov 15,2023 21:07

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు హక్కు అర్హత పొందిన యువత అందరూ ఓటర్లుగా నమోదు పొందేలా చైతన్య పరస్తూ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాలను విస్తతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, ఇఆర్‌ఒలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కోర్టు హాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 ప్రక్రియ క్రింద చేపట్టిన ఓటర్ల నమోదు, జాబితాల సవరణ, రానున్న ఎన్నికల నిర్వహణకు చేపట్టవలసిన ముందస్తు చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో సవరణ ప్రక్రియలో ఇప్పటి వరకూ అందిన ఫారం-6,7,8 ధరఖాస్తుల పరిష్కారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. జనాభా పెరుగుదల రేటు ఆధారిత అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 32 వేల మంది కొత్తగా ఓటు హక్కు అర్హత పొందారని, ఇందులో ఇప్పటికే 11 వేల మంది ముసాయిదా జాబితాలో చేరగా, సుమారు మరో 22 వేల మంది ఇంకా ఓటరు నమోదు పొందవలసి ఉందని చెప్పారు. వీరందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని కళాశాలలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. నియోజక వర్గాలవారీగా టెంపరరీ స్ట్రాంగ్‌ రూములు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ఏర్పాటుకు భవనాలను గుర్తించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియా మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రకియ సజావుగా నిర్వహించేందుకు వివిధ అంశాలపై తహశిల్దారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలపై వివరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), చోడిశెట్టి రమేష్‌ బాబు (బిజెపి), గదుల సాయి బాబా(టిడిపి), ఆకుల వెంకట రమణ(కాంగ్రెస్‌), సబ్బారపు అప్పారావు (బిఎస్‌పి) పాల్గొన్నారు.