
ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్/ సీతానగరం/సాలూరు/పాచిపెంట : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు ఆదివారం పరిశీలించారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో గల 54, 55, 56 పోలింగ్ కేంద్రాలు, సీతానగరం మండల కేంద్రంలో 111, 144, 145, 146 పోలింగ్ కేంద్రాలు, సాలూరు మండలం జీగిరాంలోని 54వ పోలింగ్ కేంద్రం, పాచిపెంట మండల కేంద్రంలో 95, 96 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదును ఆయన పరిశీలించారు. ఓటరు నమోదు వివరాలను బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఈనెల 4,5 తేదీల్లో చేపట్టడం జరిగిందన్నారు. డిసెంబరు 2,3 తేదీల్లోనూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. 2024 జనవరి 1 నాటికి ఓటరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఓటరుగా నమోదుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోని వారు, ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 27న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయడం జరిగిందని, ముసాయిదా ఓటరు జాబితాపై క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరించడం జరుగుతుందని, 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్ కేంద్రాలు వద్ద బూత్ స్థాయి అధికారులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు వద్ద ఫారం - 6, ఫారం - 7, ఫారం - 8 అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ఒకేసారి పెద్ద ఎత్తున ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ స్థాయి అధికారులు ఓటరు నమోదు అంశంలో పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆయన వెంట ఆయా మండలాల ఎన్నికల తహశీల్దార్లు, తహశీల్దార్లు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.
సీతంపేట : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి మండలంలోని హడ్డుబంగిలోని 5వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని, పులిపుట్టిలోని 10వ నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని, ముకుందాపురంలోని 11వ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సంబంధిత ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని, అదే విధంగా కొత్తగా ఓటర్లు ఉంటే వెంటనే నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో ఇంకా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ నాగేంద్ర కుమార్, బిఎల్‌ఒలు ఉన్నారు.
పార్వతీపురంటౌన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆర్‌డిఒ కె.హేమలత ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని 23, 24, 25, 37, 38, 39 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదును పరిశీలించారు. ఓటరు నమోదు వివరాలను బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. 2024 జనవరి 1 నాటికి ఓటరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఓటరుగా నమోదుకు ముందుకు రావాలని కోరారు. 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని పాలకొండ ఆర్‌డిఒ ఎం.లావణ్య రెవెన్యూ అధికారులకు సూచించారు. గుమ్మలక్ష్మీపురంలోని పోలింగ్ స్టేషన్ల నెంబర్ 74, 75 ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకరరావు, బిఎల్‌ఒలు, విఆర్‌ఒ హరికృష్ణ, మహిళా పోలీస్ అల్లక లక్ష్మి ఉన్నారు.
కురుపాం : నియోజకవర్గంలో ఓటర్లు నమోదు కార్యక్రమం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా బూత్ లెవెల్ స్థాయిలో పబ్లికేషన్ చేశారు. నియోజకవర్గంలో 397 మంది కొత్తగా ఓటర్లు నమోదు దరఖాస్తులు చేసుకోగా, 64 తొలగింపులు, పేర్లు సవరణకు 193 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా కురుపాం జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఓటర్లు నమోదు కార్యక్రమంలో ఓటర్లు నమోదు సూపర్‌వైజర్, ఎపిఒ పి.బావాజీ పరిశీలించారు. కార్యక్రమంలో బిఎల్‌ఎలు సూర్య, పైడిరాజు, రోజా, అనిత తదితరులు పాల్గొన్నారు.