ప్రజాశక్తి-కాకినాడ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024లో భాగంగా 2023, అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో ఇఇఆర్‌ఒ, ఇఆర్‌ఒలతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎస్‌ఆర్-2024, ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేలపై చర్చించారు. ఎస్‌ఎస్‌ఆర్-2024కు సంబంధించి సవరణ పూర్వ, సవరణ ప్రక్రియలన్నీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కాకినాడ జిల్లాలోని 1,634 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 16,03,574 ఓటర్లకు సంబంధించి జులై 21న బిఎల్‌వోలతో ప్రారంభమైన ఓటర్ల జాబితా ఇంటింటి తనిఖీ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఫారం 6, ఫారం 7, ఫారం 8లను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశాలకు అనుగుణంగా, అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సర్వేలో గుర్తించిన అన్‌ట్రేస్‌డ్, సిమిలారిటీ ఓట్ల విషయంలో వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు ఎన్‌వివి. సత్యనారాయణ, జె.సీతారామారావు, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, బిసి కార్పొరేషన్ ఈడీ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, కుడా విసి కె.సుబ్బారావు, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ హాజరయ్యారు.










