Nov 22,2023 00:03

తమ ఓట్లు తొలగించారని పెదకూరపాడులో ఆందోళన చేస్తున్న అమరావతి మండల ఓటర్లు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులలో భారీగా అక్రమాలు చోటుచేసు కుంటున్నాయి. ఎన్నికల సంఘ నిబంధనలను ఉల్లఘించి టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నియోజకవర్గం స్థాయిలో అధికారులు వైసిపి నాయకుల ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తున్నారని చివరికి తాము బలైపోతామని బీఎల్వోలుగా ఉన్న ఉద్యోగులు వాపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్ల జాబితాలే కీలకం కావడంతో వైసిపి, టిడిపి ఢ అంటే ఢ అంటున్నాయి. వైసిపి ప్రజా ప్రతినిధుల వత్తిడితో నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో)లు ఫారం-7 దరఖాస్తులను ఎడాపెడా స్వీకరిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం అత్తలూరులో 130, ఉంగుటూరులో 83 మంది స్థానికంగా ఉండటం లేదని ఓటర్ల జాబితాల నుంచి తొలగించారంటూ రెండు గ్రామాల ప్రజలు మంగళవారం నియోజకవర్గ కేంద్రమైనచ పెదకూరపాడులో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం, ఆరోగ్య కారణాలతో తాము స్థానికంగా నివాసం ఉండకపోయినా తమ ఇల్లు, కుటుంబ సభ్యులు, ఆధార్‌ కార్డులు ఇక్కడే ఉన్నాయని వారు చెప్పారు. తమ ఓట్లను తిరిగి పునరద్ధరించాలన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్టోబరు రెండు నుంచి ఫారం-7 దరఖాస్తులు 2679 వచ్చాయి. వీటిల్లో 20 మంది 1514 దరఖాస్తులు అందచేశారు. ఒక వైసిపి నాయకుడు 288 దరఖాస్తులు ఇచ్చారు. ఐదు కంటే ఎక్కువ మంది పేర్లుతో దరఖాస్తులిస్తే ఈఆర్‌వో విచారణ చేయాల్సి ఉంది. ఒక్కొ దరఖాస్తులో సగటున నలుగురున్నా దాదాపు 10 వేల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒక డోర్‌ నంబరుతో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉండకూడదు. తెనాలిలో ఒకే డోరు నెంబరుతో 1100 ఇళ్ల పరిధిలో 16 వేల ఓట్లు ఉన్నాయి. వీటి పరిశీలన అధికారులకు శిరోభారంగా మారింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కొత్త ఓటర్లుగా చేరేందుకు ఫారం-6 సమర్పించినా ఓట్లు ఇవ్వడంలేదని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి మీనాకు ఫిర్యాదు అందచేశారు. పలు నియోజకవర్గాల్లో చనిపోయిన వారిపేర్లు కొనసాగిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో బతికే ఉన్నా జాబితాల్లో స్థానికంగా ఉండటం లేదన్న నెపంతో ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ప్రస్తుతం ఎవరికి వారు తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటు న్నట్టు గా తగిన ఆధారాలను సమర్పిస్తే ఓట్లను కొనసాగిస్తామని అధికారులు సంబంధిత వ్యక్తులకు చెబుతున్నారు. వీరి దరఖాస్తులకు ఆధార్‌ చిరునామా మార్పు, గ్యాస్‌ బిల్లు, స్థానికంగా నివాసం ఉంటున్నట్టు నిర్ధారణైతే చిరునామా మార్పుతో ఓటును మారుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి అధికార పార్టీ నాయకుల సిఫార్సుల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి.