Oct 09,2023 21:15

బిఎల్‌ఒల సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

బెలగాం: ఓటరు జాబితా పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్‌ అన్నారు. సాలూరు నియోజకవర్గ ఓటరు జాబితా సవరణ అంశంపై గిరిమిత్ర సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోజెక్టు అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ అంశాలు పెండింగ్‌లో ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. బూత్‌ స్థాయి అధికారి నుండి ప్రతి స్థాయిలో అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. పది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలు, ఓటర్లు లేని గృహాలు, వంద కంటే ఎక్కువ వయస్సు కలిగిన ఓటర్లు ఉన్న గృహాలు విధిగా పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు. అందుతున్న ఫారాలు 7,8,9 పైనా శ్రద్ద వహించాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సహాయ ఓటరు నమోదు అధికార్లు, తదితరులు పాల్గొన్నారు.