ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన పక్కాగా జరపండి
నిర్లక్ష్యం వహించే అధికారులపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు
వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
ప్రజాశక్తి నంద్యాల కలెక్టరేట్
ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన పక్కాగా జరిపి పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో పారదర్శక ఓటర్ల జాబితా రూప కల్పనపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు, అన్ని మండలాల తాసీల్ధార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్ మేరకు ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన పక్కాగా నిర్వహించి పారదర్శక ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి జాబితా ప్రకారం అన్నీ సక్రమంగానే ఉన్నాయా, చనిపోయిన వారి పేర్లు, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను పరిశీలించాలని సూచించారు. ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ లో స్వీకరించిన ఫారం-6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువత మీద ఓటు నమోదుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డూప్లికేట్ ఓటర్లు జాబితాలోకి రాకుండా చూసుకోవడంతో పాటు సుమోటోగా డిలీట్ చేయకుండా ఫారం 7 నోటీస్ ఇచ్చి డిలీట్ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లోని మొత్తం ఓటర్లలో 2 శాతం తొలగింపులు కానీ, 4 శాతానికి మించి చేర్పులు గాని ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమీక్షలో డిఆర్ఓ పుల్లయ్య,నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.










