![](/sites/default/files/2023-11/coll%20voter_0.jpg)
ప్రజాశక్తి - పార్వతీపురం : కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6,7,8 లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు జాబితా తయారీ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా తయారీ ప్రక్రియను వివరించారు. ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులు, మార్పులకు సంబంధించి ఫారం6, 7, 8 తీసుకొని పరిష్కరిస్తామన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస పోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగిస్తామని, పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందనగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ''0'' ఇంటి నంబరు, ఒకే ఇంటి నంబరులో పది ఓట్లకు మించి ఉన్న వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, కె.ఆర్.సి.సి. డిప్యూటీ కలెక్టరు కేశవనాయుడు పాల్గొన్నారు.
18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు
18ఏళ్లు దాటిన ప్రతి యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయాలని కలెక్టరు నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో ఓటరు జాబితా సవరణపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. డిసెంబరు 5లోగా మొత్తం దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. డిశంబర్లో ఎన్నికల కమిషను ఉన్నతాధికారుల బృందం పర్యటన ఉందని, ఓటరు జాబితా తయారీలో లోపాలు గుర్తిస్తే బాధ్యులైన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి కళాశాలలో 18ఏళ్లు దాటిన వారి వివరాలు తీసుకొని, ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదుచేయాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేయకపోతే ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుంటామన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన, శాశ్వతంగా వలసపోయిన వారి పేర్లను వెంటనే తొలగించాలని, అలా చేయకపోతే సంబంధిత బిఎల్‌ఒ, సూపర్ వైజర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. బలిజపేట మండలంలో చనిపోయిన వారి పేర్లు ఎక్కువగా ఓటరు జాబితాలో ఉన్నట్లు గుర్తించామని,వెంటనే చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, కెఆర్‌సిసి.డిప్యూటీ కలెక్టరు కేశవనాయుడు, ఆర్‌డిఒలు కె.హేమలత, ఎం.లావణ్య, తహశీల్దార్లు పాల్గొన్నారు.