ప్రజాశక్తి -పార్వతీపురం : ప్రత్యేక ఓటరు జాబితా పునశ్చరణ కార్యక్రమంలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు నిశాంత్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సోమవారం కలెక్టరు కార్యాలయం నుండి సమీక్షించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా పునశ్చరణ, హౌసింగు, నరేగా, ప్రాధాన్యత భననాలు నిర్మాణం, రీసర్వే, గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష తదితర పథకాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా నిర్వహించా లని, అధికారులు ఎవరి విధులను వారు ఖచ్చితంగా నిర్వర్తించాలని, ఎక్కడైనా అధికారులు సక్రమంగా పనిచేయలేదని ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, విధుల్లో అలక్ష్యం వహించిన బిఎల్‌ఒలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బూత్ స్థాయి అధికారులతో ఇంటింటా ఓటరు వివరాల విచారణ నిర్వహించాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల నిర్మాణం పనుల్లో దశల వారీ పురోగతి 50శాతం మించడంలేదని, లే అవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను కల్పించి నిర్మాణ పనులు వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపల పూర్తిచేయాలని తెలిపారు. నరేగా పనుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాలు పడుతున్నందున గోతులు తీసి నెలాఖరునాటికి మొక్కలు నాటడం పూర్తిచేయాల న్నారు. ముఖ్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలు నూరుశాతం పూర్తిచేయాల న్నారు. రీసర్వే పనులను సకాలంలో పూర్తిచేయాలని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటిని పూర్తిచేసి, బిల్లులను వెంటనే చెల్లింపులు నిమిత్తంరికార్డు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జెసి ఆర్.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డ్వామా పీడీ కె.రామ చంద్ర రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, ఐసిడిఎస్ కె.విజయగౌరి, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజకుమార్ పాల్గొన్నారు.
బిఎల్‌ఒ సస్పెన్షన్
పాలకొండ :ఓటరు నమోదు కార్యక్రమంలో విధుల్లో అలక్ష్యం వహించిన బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ)ని సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బాసూరువారివీధి సచివాలయంలో వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శిగా పనిచేస్తున్న హేమంత్ కుమార్‌ను 168 పోలింగ్ కేంద్రం బిఎల్‌ఒగా నియమించారు. 2024 సంవత్సరానికి జరుగుతున్న ప్రత్యేక ఓటరు పునశ్చరణ కార్యక్రమం (స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024)లో అనేక సార్లు ఆదేశించినప్పటికి విధులకు హాజరు కాకపోవడం, కనీసం ఫోను చేసినా స్పందించక అలక్ష్యం వహిస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓటరు నమోదు కార్యక్రమానికి విఘాతం కలిగిస్తున్నట్లు ఆధారాల అనుగుణంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.










