Oct 31,2023 00:49

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: భూముల రీసర్వే డేటాను వేగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో భూ సర్వే, మ్యుటేషన్లు, చెట్లు కటింగ్‌ అనుమతులు, అస్సైన్మెంట్‌ భూములకు డి.ఫారం పట్టాలు పంపిణీ, ఓటరు జాబితా తయారీ, కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన ఓటర్ల తొలగింపు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ హక్కు పత్రాల ఇకెవైసీని నిర్ధిష్టమైన గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. తహశీల్దారులు, బిఎల్‌ఓలు, వి.ఆర్‌ . ఓలు మరొక సారి పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ నిర్వహించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయా ? లేదా ? గతంలో ఎన్నికలు నిర్వహించారా అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు. నవంబరు 4, 5 డిసెంబరు 2, 3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించి కొత్త ఓటర్లను నమోదు చేయాలని చెప్పారు. ఓటరు తొలగింపు ప్రక్రియలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా లో అర్హులైన ఓటర్లు నమోదు, ఓటర్ల తొలగింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించాలని తాహశీల్దారులకు సూచించారు. చెట్లు నరకడానికి వచ్చిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, పాడేరు ఇన్చార్జి సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ ,రంపచోడవం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, సర్వే సహాయ సంచాలకులు వై. మోహన రావు, 22 మండలాల తహశీల్దారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.