కడప జిల్లాలో ఓటర్ల సవరణ జాబితా తయారీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వి.విజరు రామరాజు ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఓటర్ల సవరణ జాబితా 2024 పై జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డుప్లికెట్ ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వలస పోయిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహం అయ్యి వేరే ఊళ్లకు వెళ్లిన వారు, పునరావతం అయిన పేర్లు వెంటనే తొలగించాలన్నారు. జిల్లాలో ఫారమ్ -6 ఫారమ్-7, ఫారమ్-8 పెండింగ్‌లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చి 30 రోజులు దాటిన దరఖాస్తులపై ప్రత్యేక దష్టి సారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. బిఎల్‌ఒలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఇఆర్‌ఒలను సూచించారు. అలాగే ముసాయిదా జాబితాలో ఓటర్ల చేర్పులు, తొలగింపులను సూక్ష్మ దష్టితో పరిశీలించి ఓటర్ల సవరణ జాబితాను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్‌డిఒలు మధుసూదన్, శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ఇతర నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర పాల్గొన్నారు.