Aug 18,2023 22:05

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం: జిల్లాలో 90 శాతం ఓటర్ల ఇంటింటి సర్వే పూర్తి చేయడంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా అభినందించారు. మిగిలిన పది శాతం కూడా రానున్న మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఓటర్ల సర్వేపై శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సర్వే ముగిసిన తర్వాత బిఎల్‌ఒల యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు సంబంధిత వ్యక్తుల ఇళ్లకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా ముందస్తు నోటీసు జారీ చేయాలన్నారు. నోటీసు జారీ అయిన 15 రోజుల తర్వాత నిర్ధారించుకొని తొలగింపులు చేయాలని స్పష్టం చేశారు. గతేడాది జనవరి ఆరు నుంచి ఈనెల పదో తేదీ వరకు జరిగిన తొలగింపు ఓటర్ల జాబితాలను పున:పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ జిల్లాలో 5,87,150 గృహాలకు గానూ 5,26,294 గృహాలను సందర్శించి 90 శాతం సర్వే పూర్తి చేశామన్నారు. 18,06,841 మంది ఓటర్లకు గానూ 10,164 మంది ఓటర్లు మరణించినట్లు సర్వేలో నిర్ధారించినట్లు తెలిపారు. ప్రతి ఇంటినీ సర్వే చేయించి సందేహం ఉన్న చోట అధికారులతో పున:పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.