ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆరోపణలు, అవకతవకలకు తావు లేకుండా అధికారులు పని చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీల వినతులను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వేపై ఇఆర్వోలు, ఎఇఆర్వోలతో కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. సర్వే తీరు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులుగా కొనసాగుతున్న వారు నిష్పక్షపాతంగా పనిచేయాలని, సర్వేను త్వరగా పూర్తిచేసి నివేదించాలని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం పాల్గొన్నారు.










