
బిఎల్‌ఒలకు కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
ప్రజాశక్తి - పాలకోడేరు
ఓటర్ల సర్వే పక్కాగా చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బిఎల్‌ఒలను హెచ్చరించారు. విస్సాకోడేరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డోర్ టు డోర్ సర్వే, ఎన్ని గృహాలు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని గృహాలు మిగిలున్నాయని అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారు ఎంతమంది ఉన్నారు, వారి ఓట్లు తొలగించారా లేదా అని పరిశీలించారు. కొత్తగా ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, చేర్పులు, మార్పులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను, కంప్యూటర్ డేటాను కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని దోష రహితంగా తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాములను చేస్తున్నట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తప్పవని జిల్లా హెచ్చరిం చారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకొని ఈ నెల 21వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. నిర్ణీత గడువు సమీపిస్తున్నందున ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎం.నాగభూషణరావు, ఎలక్షన్ సూపర్‌వైజర్ శేషయ్యనాయుడు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.