Aug 20,2023 21:00

జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి
ప్రజాశక్తి - ఆచంట
వివాదాలకు తావులేకుండా ఇంటింటా ఓటర్ల జాబితా నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం వల్లూరు గ్రామ సచివాలయాన్ని, ఇంటింటా సర్వేను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే రిజిస్టర్లు, కంప్యూటర్‌ డేటాను ఆమె పరిశీలించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి ఓట్లు డిలీట్‌ చేశారా అని పరిశీలించి, చేర్పులు మార్పులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టరు స్వయంగా ఇంటింటి సర్వే పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అధికారులు, బిఎల్‌ఒలతో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని నూరు శాతం సర్వే పూర్తి చేయాలని తెలిపారు. బిఎల్‌ఒలు తమ వెంట వాలంటీర్లను గానీ మరి ఏ ఇతర వ్యక్తులను గానీ తీసుకెళ్లరాదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రెండు శాతం కంటే ఎక్కువగాని ఉంటే తహశీల్దార్లు ఒకసారి పరిశీలించాలన్నారు. ఒకే డోర్‌ నంబర్లో 10 మంది ఓటర్లు ఉంటే ఒకటికి రెండు సార్లు పరిశీలిం చాలన్నారు. ఓటరు జాబితాను అత్యంత బాధ్యతగా తయారుచేసే పనిలో నిమగమై ఉండాల న్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎస్‌టివి.రాజేశ్వరరావు, తహశీల్దార్‌ ఎస్‌వి. సుబ్రహ్మణ్యం, ఎంపిడిఒ విఎస్‌విఎల్‌.జగన్నాథరావు, పంచాయతీ కార్యదర్శి జివివి.సత్యనారాయణ, బిఎల్‌ఒలు, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని జిన్నూరు గ్రామంలో సచివాలయం-1ను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయం పరిధిలో ఓటర్‌ సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. బిఎల్‌ఒలు, రెవెన్యూ సిబ్బంది సోమవారానికి డోర్‌ టు డోర్‌ ఓటర్‌ సర్వే పక్రియను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చేయాలన్నారు. సర్వేలో ఎటువంటి లోపాలు లేకుండా బాధ్యతగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ ఆర్‌వి.కృష్ణారావు, డిప్యూటీ తహశీల్దార్‌ డి.రాజేష్‌, ఆర్‌ఐ కె.రాంబాబు, విఆర్‌ఒ బుజ్జి, సీనియర్‌ అసిస్టెంట్‌ త్రిమూర్తులు ఉన్నారు.
పాలకొల్లు రూరల్‌ : ఆదివారం మండలంలోని పూలపల్లి, భగ్గేశ్వరం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన రిజిస్టర్లు, కంప్యూటర్‌ డేటాను పరిశీలించారు. గ్రామాల వారీగా ఇప్పటివరకూ అయిన పనితీరును అడిగి తెలుసుకుని, ఈ రోజు అర్ధరాత్రి అయినా పర్వాలేదు నూరుశాతం సర్వే పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించారని ఎటువంటి ఫిర్యాదుకూ అవకాశం లేకుండా చేయాలన్నారు. ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024లో భాగంగా ఇంటింటి సర్వేపై బిఎల్‌ఒలు, నియోజకవర్గ, మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 21లోగా గడువు ఉన్నా, ఈ రోజు రాత్రికి పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వికలాంగులను పిడబ్ల్యూడి ఓటర్లుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతి బిఎల్‌ఒ వద్దా బిఎల్‌ రిజిస్టర్‌ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ కెసిహెచ్‌ అప్పారావు, తహశీల్దార్‌ సిహెచ్‌ పెద్దిరాజు, డిప్యూటీ తహశీల్దార్‌ వి.బ్రహ్మాజీ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.