Sep 01,2023 23:25

ప్రజాశక్తి - చీరాల 
ఆధారాలు లేకుండాఓటర్లు జాబితాలో ఓటర్ల పేర్లు తొలగించవద్దని కలెక్టర్ పి రంజిత్ బాషా తహసీల్దార్లను ఆదేశించారు. చీరాల మున్సిపాలిటీలోని వుడ్ నగర్ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో మృత్యులు, వలసలు వెళ్లిన వారు, ఒకే పేరుమీద రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారిని కలెక్టర్ స్వయంగా వెళ్ళి శుక్రవారం విచారించారు. వుడ్ నగర్‌లో ఓటర్లు జాబితాలో మృతి చెందిన ఓటర్ల వివరాలు వారి కుటుంబ సభ్యులను అడిగి, వలసలు వెళ్లిన వారి కుటుంబాల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె ప్రభాకరావు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఎలక్షన్స్ సుపర్డెంట్ కృష్ణ కాంత్ పాల్గొన్నారు.
వేటపాలెం : క్షేత్రస్థాయిలో మృతుల ఓటర్ల తొలగింపు ప్రక్రియ పక్కాగా ఉండాలని కలెక్టర్ రంజిత్ భాష అధికారులకు సూచించారు. చిన్నగంజాం మండలం సోపిరాలలో మృతుల ఓటర్ల తొలగింపు ప్రక్రియను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల తొలగింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా సమగ్ర సమాచారంతో చనిపోయిన వారి ఓట్లు, గ్రామంలో దీర్ఘకాలికంగా లేని వారిని తొలగింపులో చట్టప్రకారం ప్రొసీజర్ ఫాలో కావాలని స్థానిక అధికారులను ఆదేశించారు. 272, 273, 274బూతు లెవలలో 165ఓట్లను తొలగించగా వాటిని ఏరకంగా తొలగించారో కలెక్టర్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట చిన్నగంజాం తాసిల్దార్ పీ పార్వతి, వీఆర్వో సత్యం ఉన్నారు.