* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఓటర్ల జాబితాలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఇఆర్‌ఒలదేనని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ అన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ముందుగా ఇఆర్‌ఒల దృష్టికి తీసుకెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఇంటింటి ఓటర్ల సర్వేపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 18,06,841 మంది ఓటర్లకు గానూ గత నెల 21 నుంచి నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు 12,53,399 మంది ఓటర్లను గుర్తించి 69 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. సర్వేను పూర్తి చేసేందుకు ఇంకా ఆరు రోజుల గడువు ఉన్నందున మిగిలిన సర్వేను త్వరగా పూర్తి చేయాలని బిఎల్‌ఒలను ఆదేశించామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు కొత్త ఓటర్లుగా 26,137 దరఖాస్తు చేసుకోగా 11,682 మంది పూర్తి కాగా, మిగిలినవి పరిశీలించాల్సి ఉందన్నారు. తొలగింపుల కోసం 15,293 మంది దరఖాస్తులు రాగా, అందులో 10,948 పూర్తి చేశామని, మిగిలినవి పరిశీలించాల్సి ఉందన్నారు. సవరణల కోసం 63,823 దరఖాస్తులు అందాయని, వాటిలో 19,666 పూర్తి కాగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. అత్యధికంగా ఉన్న ఓటర్ల తొలగింపులు, కొత్త ఓటర్లు నమోదైన పోలింగ్ స్టేషన్లను స్వయంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల దృష్టికి వచ్చిన సమస్యలను ఇఆర్‌ఒల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. వైసిపి, టిడిపి పోలింగ్ స్టేషన్ పరిధిలో బిఎల్‌ఒలను నియమించుకున్నారని, మిగిలిన పార్టీలూ నియమించుకున్నట్లయితే పోలింగ్ స్టేషన్ పరిధిలోని సమస్యలను అక్కడే పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్ల మార్పు వంటి వాటిని రేషనలైజేషన్ కార్యక్రమంలో చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ సమావేశాలు ప్రతి వారం ఉంటాయని, సమస్యలను తెలియజేస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఓటర్లను తొలగిస్తే అటువంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










