ప్రజాశక్తి - ఏలూరు
ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల సెల్ ఫోన్లను అనుమతించవద్దని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం ఎన్నికల జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బంది పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలో ఎన్నికల కమిషన్ నియమనిబంధనలను ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా పాటించాలన్నారు. పోలింగ్ సిబ్బంది తమ సందేహాలను శిక్షణా సమయంలోనే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ సమయంలో కొంతమంది ఓటర్లు తాము ఓటువేసిన విధానాన్ని తమ సెల్ ఫోన్‌లలో ఫొటో తీసి, సామాజిక మాద్యమాల్లో పోస్టుచేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌లోకి ఓటువేసేందుకు వచ్చే ఓటర్లను మాత్రమే అనుమతించాలని, వారితో పాటు సెల్ ఫోన్ బ్యాలెట్ బాక్స్ ఉన్న రూమ్‌లోకి అనుమతించొద్దన్నారు. పోలింగ్ బూత్ బయట ఉన్న పోలీస్ సిబ్బందికి సెల్ ఫోన్ అప్పగించిన తరువాతే పోలింగ్ బూత్‌లోకి ఓటరును అనుమతించాలని, అయినప్పటికీ ఓటర్లకు బ్యాలెట్ పేపర్ అందించే సిబ్బంది ఓటరు వద్ద సెల్ ఫోన్ ఉన్నదీ, లేనిదీ పరిశీలించి, సెల్ ఫోన్ ఉన్నట్లయితే, స్వాధీనం చేసుకుని, ఓటు వేసి వెళ్లే సమయంలో అప్పగించాలన్నారు. పోలింగ్ బూత్‌లోని పోలింగ్ ఏజెంట్‌లు ఓటర్ల గుర్తింపును నిర్ధారించాలని, పోలింగ్ సిబ్బంది కూడా ఓటరు గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా పరిశీలించిన అనంతరమే బ్యాలెట్ పత్రాన్ని అందించాలన్నారు. పోలింగ్ సమయంలో ఇరుపక్షాల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకోవాలని, వచ్చిన ఓటర్లు కూర్చునేందుకు అనువైన ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బంది పోలింగ్ సామగ్రిని 12వ తేదీ సాయంత్రమే తీసుకుని, అదేరోజు రాత్రికి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాలన్నారు. 13వ తేదీ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియకు పోలింగ్ స్టేషన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్ కాస్టింగ్‌ను ముందుగా పరిశీలించుకోవాలని, ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ లేదా జోనల్ అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల జోనల్ అధికారులైనా ఆర్‌డిఒలు పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ సరళిపై నిర్ణీత సమయంలో అందించే నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని, అందుకు సంబంధించిన ప్రొఫార్మాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శుక్రవారం మరోసారి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెసి, రిటర్నింగ్ అధికారి పి.అరుణ్‌బాబు, డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్.మూర్తి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, ఆర్‌డిఒలు మల్లిబాబు, డిఎస్.రాజు, జాన్సీరాణి, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.రామకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, మైక్రో ఆబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










