ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్ర ప్రాంతాల మార్పులు : జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా
ప్రజాశక్తి - బాపట్ల జిల్లా
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను మార్పు చేయడానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ప్రాథమికంగా మండల, నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల అధికారులు ప్రతిపాదించిన అంశాలపై రాజకీయ పార్టీల నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పోలింగ్ కేంద్రాలు మార్పు చేస్తూ ఫార్మేట్ ఒకటిలో పొందుపరుస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల పేర్లను మార్పు చేసినవి ఫార్మేట్-2లో, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలను ఫార్మేట్-3లో పొందుపరుస్తామన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు సులభతరంగా వినియోగించుకోడానికి వీలుగా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి అధికారులు పనిచేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతం 157 పోలింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఒకే ప్రాంతంలో శిథిలమైన భవనాల నుంచి పక్కనే ఉన్న మరొక భవనంలోకి 43 పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడానికి ప్రాథమికంగా గుర్తించామన్నారు. 122 పోలింగ్ కేంద్రాల పేర్లను మాత్రమే మార్పు చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. జిల్లాలో నూతనంగా మరొక మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. బాపట్ల, చీరాల, అద్దంకి, పర్చూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో అధికారుల నుంచి వచ్చిన నివేదికను క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన తదుపరి సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు. ఈ మార్పుల ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామన్నారు. సమావేశంలో డిఆర్ ఎవిఎస్ఎన్ మూర్తి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణ కాంత్, బిఎస్‌పి కె కోటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, బిజెపి నాయకులు కెవి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు టి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు షేక్ ఎండి గౌస్ బాషా, వైసిపి నాయకులు వాసుదేవ పాల్గొన్నారు.










