ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 రూపకల్పనలో భాగంగా చేపట్టిన మార్పులు చేర్పుల ప్రక్రియపై ఇఆర్‌ఒలు ప్రత్యేక దృష్టితో పని చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 రూపకల్పన ప్రక్రియ పురోగతి, ఓటర్ల సవరణ జాబితా అభ్యంతరాలు పరిష్కారం, మార్పులు, చేర్పులు ఎలక్టోరల్ రోల్స్, బిఎల్‌ఒల శిక్షణ, ఇంటి నెంబర్ తనిఖీ, మరణించిన వారి వివరాలు వంటి అంశాలపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ (ఒఆర్‌ఒ) అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా రూపకల్పన నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఇఆర్‌ఒ ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. కొత్త ఓటరు నమోదుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 రూపకల్పనలో భాగంగా చేపట్టిన చేర్పులు, మార్పులు ప్రక్రియపై ప్రత్యేక దష్టితో పని చేయాలన్నారు. ఇందుకు క్షేత్రస్థాయి బిఎల్‌ఒలను సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితా రూపకల్పన చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టరు ప్రఖర్ జైన్, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్. నాగనరసింహారావు, కెఎస్‌ఇజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, కుడా విసి సుబ్బారావు, విసి కార్పొరేషన్ ఈడి ఎస్‌విఎస్.సుబ్బలక్ష్మి, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు ఎన్‌వివి.సత్యనారాయణ, జె.సీతారామారావు, అర్బన్ తహసీల్దార్ సీతాపతిరావు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు.










