Nov 05,2023 22:43

కొత్తూరు : అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - కొత్తూరు, ఆమదాలవలస : 
ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించి ఈనెల 4, 5 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌ విజయవంతమైనట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. కొత్తూరు మండలం పారాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆమదాలవలస మున్సిపాల్టీలోని 14వ వార్డులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓటర్ల దరఖాస్తులను పరిశీలించారు. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులతో పాటు పలు అంశాలపై బిఎల్‌ఒలకు సూచనలు చేశారు. ఫారం-6, 7, 8 నమోదులో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయా అని ఆమదాలవలసలోని 32వ పోలింగ్‌ కేంద్రంలో టిడిపికి చెందిన బిఎల్‌ఎ కూన రామును ప్రశ్నించారు. ఎటువంటి అభ్యంతరాలు, ఇబ్బందుల్లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్‌ఒలు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాల స్వీకరణను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీ ఉండరాదన్నారు. ఒకే కుటుంబం ఒకే బూత్‌లో ఉండాలని స్పష్టం చేశారు. బిఎల్‌ఒల సమక్షంలో ఓటర్ల నమోదు చేయాలని చెప్పారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు ఎం.చక్రవర్తి, దువ్వాడ అమర్నాథ్‌, డిటిలు మురళీధర్‌ నాయక్‌, అనంత కుమార్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.