Nov 05,2023 20:18

బిఎల్‌ఒకు పత్రాలను అందిస్తున్న ఆర్‌డిఒ సాయిశ్రీ

ప్రజాశక్తి- బొబ్బిలి : ఓటర్ల నమోదులో పారదర్శకత పాటించాలని ఆర్‌డిఒ సాయిశ్రీ కోరారు. ఓటర్ల నమోదు ప్రత్యేక ప్రచార దినం సందర్భంగా ఆదివారం మండలంలోని మెట్టవలస, పిరిడి, పట్టణంలోని జెండావీధి, గొల్లపల్లి, గెస్ట్‌ హౌస్‌ కాలనీ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా యువతీ యువకులను చైతన్యం చేయాలని కోరారు. డబుల్‌ ఎంట్రీ, మరణించిన వారి ఓట్లను, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించాలని ఆదేశించారు. బిఎల్‌ఒలు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమెతో తహశీల్దార్‌ డోల రాజేశ్వరరావు ఉన్నారు.
తెర్లాం: మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డిఒ సాయిశ్రీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఓటర్‌ లిస్టును సక్రమంగా చూసుకోవాలన్నారు.