Oct 12,2022 23:23

ఫిర్యాదు చేస్తున్న సిఐటియు నేతలు

అధికార పార్టీకి అనుకూలంగా సచివాలయ సిబ్బంది ప్రచారం
తక్షణమే తగు చర్యలకు సిఐటియు నేతల ఫిర్యాదు
ప్రజాశక్తి -పిఎం పాలెం :
ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఓటర్ల నమోదు, వైసిపి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారిని నియంత్రించాలని మధురవాడ జోన్‌ సిఐటియు నేతలు కోరారు. ఈ మేరకు బుధవారం జివిఎంసి రెండో జోన్‌ కార్యాలయంలో సూపరెంటిండెంట్‌ జి.అప్పలరాజుకు సిఐటియు మధురవాడ జోన్‌ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.అప్పలరాజు, పి.రాజ్‌కుమార్‌ వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, ఎన్నికల మార్గదర్శకాలను మధురవాడ జోన్‌లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇసుమంతైనా పాటించడం లేదని, మధురవాడలోని అన్ని ప్రాంతాలలో సచివాలయ కార్యదర్శులు, వార్డు వాలంటీర్లు పట్టభద్రుల ఓటర్లను నమోదు చేస్తున్నారన్నారు. వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిలా కాకుండా, వైసిపి వర్కర్లుగా ఇష్టారాజ్యంగా అధికారపార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోకుంటే, ఉన్నతస్థాయికి ఫిర్యాదు చేస్తామన్నారు.