ఓటర్ల జాబితాపై బిఎల్ఓ లతో ఇంటింటి పరిశీలన..
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా పరిశీలనకు సంబంధించి పోలింగ్ బూత్ అధికారుల శిక్షణా కార్యక్రమం ఈనెల 20వ తేదీ పూర్తవుతుందని ఈ నెల 21 వ తేదీ నుండి నెల రోజులపాటు బిఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓట్ల జాబితా పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించారు. మంగళవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి వచ్చే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తొలగింపులు, స్త్రీ పురుష నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య, ఎన్నికల విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఈ నెల 21 వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.* ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కూడా ఈనెల 20వ తేదీ పూర్తవుతుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల మార్పు తదితర అంశాలపై ఈనెల 20వ తేదీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు ఫార్మ్ 6,6ఎ,7,8 లకు సంబంధించి 5328 పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. మొత్తం ఓటర్లకు అడిషన్స్, డెలిషన్స్, స్త్రీ పురుష నిష్పత్తి, ఇ.పి. రేషియో తదితరాలు భారతి ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకే ఉన్నాయని కలెక్టర్ నివేదించారు. ఇప్పటివరకు 386 గృహాలలో ఇంటి నంబర్లు తేడాలు వున్నట్లు, ఒకే ఇంట్లో 10 ఓటర్లకు మించిన 3441 కుటుంబాలు ఉన్నట్లు కమిషనర్ కు వివరించారు. వంద సంవత్సరాలకు పైబడిన ఓటర్లు 117 మందిని వెరిఫై చేశామని కలెక్టర్ తెలిపారు.










