రాయచోటి : ప్రత్యేక ఓటరు జాబితా 2024 సంక్షిప్త సవరణకు సంబంధించి ఓట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి 'ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024'కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గిరీష, జెసి ఫర్మన్ అహ్మద్‌ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ పాల్గొన్నారు. నూతన పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈ నెల 23లోగా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆయా జిల్లాలకు అందిన ఇవిఎంలను స్కానింగ్ చేసి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో కలెక్టర్లందరూ కషి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. 2022 జనవరి 6వ తేదీ నాటి ఓటరు జాబితాలో తొలగింపులకు సంబంధించి 21,725 డెత్ ఓటర్లలో 21,395 క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించామని చెప్పారు. మిగిలిన వాటిని ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు. పొలిటికల్ పార్టీల నుంచి అందిన డెత్, పర్మినెంట్లీ షిఫ్టెడ్, మల్టిపుల్ ఎంట్రీస్ ఫేక్, డోర్ నెంబర్ నాట్ అవైలబుల్ కేసులను కూడా పరిశీలన చేసి రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాయచోటి, మదనపల్లె ఆర్డీవోలు రంగస్వామి, మురళి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.










